

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, వేధింపులు, భిక్షాటన ముఠాల ఆగడాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో గృహప్రవేశం సందర్భంగా రూ.50 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో డీజీపీ ఈ అంశంపై స్పందించారు. ప్రజలను వేధిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ట్రాన్స్‌జెండర్లను సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్, HYDRAA వంటి విభాగాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల మొత్తం కమ్యూనిటీకి చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన వసూళ్లు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం లేదా వేధింపులకు పాల్పడే ఘటనలు ఎదురైతే ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు లేదా ఇతర ఆధారాలు అందుబాటులో ఉంటే పోలీసులకు అందజేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్దోషులైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కూడా అధికారులు స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!