

హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు హత్యకు గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. నేరానికి దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలోని భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలను విచారణలో పరిశీలించాలని స్పష్టం చేశారు.
కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సాక్ష్యాలను వీలైనంత త్వరగా సేకరించి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నేరానికి పాల్పడిన వ్యక్తికి చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ చేపట్టాలని ఆదేశించారు.
బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని సీఎం సూచించారు. న్యాయశాఖ, పోలీసుశాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి విచారణలో జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశారు.
ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!