

విజయవాడలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈట్‌స్ట్రీట్‌లోని ఓ ఫ్రైడ్ చికెన్ దుకాణంలో వంట నూనెను పదేపదే వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం టోటల్ పోలార్ మెటీరియల్స్ (టీపీఎం) స్థాయి 25కు మించకూడదని అధికారులు పేర్కొంటుండగా.. అక్కడ 32 పాయింట్లుగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేశారు. అంతకుముందు ఆహార భద్రత, తూనికలు-కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, సరైన విధంగా నిల్వ చేయని పదార్థాలు, అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగం, తేదీలు లేకుండా ఉత్పత్తుల విక్రయం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 100 కిలోల నిల్వ చేసిన మాంసం, ఇతర బేకరీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
సత్యనారాయణపురం, గురునానక్ నగర్ తదితర ప్రాంతాల్లోని కొన్ని ఆహార విక్రయ కేంద్రాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సత్యనారాయణపురంలోని ఓ బేకరీకి అవసరమైన అనుమతులు లేవని, తేదీలు లేని బ్రెడ్, ఇతర పదార్థాలతో పాటు పాడైన పదార్థాలను శీతలీకరణ యంత్రాల్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. బేకరీలో మాంసాహార పదార్థాల విక్రయానికి అనుమతి లేకపోయినా కొన్ని రోజులుగా నిల్వ చేసిన చికెన్ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో రెస్టారెంట్‌లో కొన్ని రోజుల కిందట వండిన చికెన్, మటన్, అన్నం వంటి పదార్థాలను నిల్వ చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా సాధారణ తనిఖీలు తగ్గుతున్నాయని, వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగానే పలు తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!