

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన టెర్మినల్‌ను సందర్శించి ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, ఏవియేషన్ హబ్, మాస్టర్ ప్లాన్ తదితర అంశాలను పరిశీలించారు. జీఎంఆర్ ప్రతినిధులు విమానాశ్రయ ప్రత్యేకతలను ప్రధానికి వివరించారు.
ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక ద్వారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పర్యాటకం, పెట్టుబడులు, విమానయాన శిక్షణకు ఈ ప్రాజెక్ట్ కొత్త అవకాశాలు తీసుకురానుందని అన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో ప్రయాణిస్తూ 13,500 మందితో నిర్వహించిన రికార్డు స్థాయి థింసా నృత్యాన్ని వీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదాయ బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించగా, ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వేడుకగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!