

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. నేడు కూడా అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణలో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెదర్‌మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సిద్దిపేట, మెదక్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు ఏపీలోనూ పలు జిల్లాలకు వర్షసూచన ఉంది. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!