

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకునే ఉపరాష్ట్రపతి.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులు సూచించారు. సమీక్ష సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!