

మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ సాధారణ ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపించినా.. దాని తయారీలో ఎన్నో విలువైన లోహాలు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. బంగారం, వెండి, రాగి, టాంటలమ్, కోబాల్ట్, లిథియం, గ్రాఫైట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సిలికాన్ వంటి పదార్థాలను వివిధ భాగాల్లో వినియోగిస్తారు. బంగారాన్ని తక్కువ పరిమాణంలోనే ఉపయోగించినా.. తుప్పుపట్టకపోవడం, అద్భుతమైన విద్యుత్ వాహకత కారణంగా సర్క్యూట్ బోర్డులు, యూఎస్‌బీ పోర్టులు, బ్యాటరీ టెర్మినల్స్, సిమ్, మైక్రోచిప్‌లలో వినియోగిస్తారు. వెండిని సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, సోల్డర్, కనెక్షన్ పాయింట్లలో ఉపయోగిస్తారు. రాగి మాత్రం వైరింగ్, సిగ్నల్ ట్రాన్స్‌మిషన్, బ్యాటరీలు, స్పీకర్లు, మైక్రోఫోన్లు, ఛార్జింగ్ భాగాలు, వేడి నియంత్రణలో ముఖ్యమైనది.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీల పనితీరులోనూ పలు ఖనిజాలు కీలకంగా ఉంటాయి. లిథియం-అయాన్ బ్యాటరీల్లో కోబాల్ట్ బ్యాటరీ స్థిరత్వం, భద్రతను మెరుగుపరుస్తుంది. లిథియం తక్కువ బరువులో ఎక్కువ విద్యుత్ శక్తిని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. గ్రాఫైట్ బ్యాటరీలో నెగెటివ్ ఎలక్ట్రోడ్‌గా పనిచేయడంతో పాటు వేడి నియంత్రణలో ఉపయోగపడుతుంది. నికెల్ బ్యాటరీలు, మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిస్‌ప్లేలు, స్పీకర్లు, వైబ్రేషన్ మోటార్లు, కెమెరా భాగాల్లో కీలకంగా ఉంటాయి. సిలికాన్ ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లు, రేడియో భాగాలకు ప్రాథమిక సెమీ కండక్టర్‌గా పనిచేస్తుంది. ఈ ఖనిజాల లభ్యత, ధరలు స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!