

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది సిబ్బందికి ప్రతి నెలా మొదటి తేదీన తప్పనిసరిగా జీతాలు చెల్లించాలని ఆదేశించారు. శాశ్వత, ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అనే తేడా లేకుండా అన్ని శాఖల ఉద్యోగులకు ఒకేసారి జీతాలు అందాలని, ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని స్పష్టం చేశారు. చేయూత పథకం కింద పింఛన్లను తపాలా విధానం బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఆధార్, ఓటరు ఐడి, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఆధారంగా పింఛన్లను క్రమబద్ధీకరించాలని తెలిపారు.
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పారదర్శకంగా, ఏకరీతిగా పింఛన్ల పంపిణీ జరగాలని పేర్కొన్నారు. కొత్త పింఛన్ల మంజూరులో ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బందికి ప్రతినెల రూ.50 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల మాదిరిగానే పంచాయతీ సిబ్బందికి కూడా సమయానికి జీతాలు అందాలని అన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వతంత్రతను పునరుద్ధరించేందుకు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)కు సవరణలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!