

ఆకస్మిక వరదలతో నేపాల్ తీవ్రంగా అల్లకల్లోలమైంది. చైనా సరిహద్దు సమీపంలోని పలు ప్రాంతాలు వరదలకు కొట్టుకుపోగా.. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. భారత్, చైనా, అమెరికా, యూకే, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా పలు దేశాలు రెస్క్యూ, సహాయక చర్యల్లో భాగస్వాములవుతామని ముందుకొచ్చాయి. అయితే ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాల సాయం తమకు అవసరం లేదని నేపాల్ స్పష్టం చేసింది. తమ భద్రతా బలగాలకు గాలింపు, సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
విదేశీ రెస్క్యూ బృందాలను తిరస్కరించడానికి 2015లో సంభవించిన గోర్ఖా భూకంపం అనుభవమే కారణమని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో విదేశీ బృందాలు రావడంతో సమన్వయ సమస్యలు తలెత్తి సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. అయితే రెస్క్యూ బృందాల సాయాన్ని వద్దన్న నేపాల్ ఆర్థిక సహాయాన్ని మాత్రం కోరుతోంది. అమెరికా, యూకే, ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, యాపిల్ తదితర సంస్థలు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఈ నిధులు ప్రధానమంత్రి సహాయ నిధికే చేరేలా చూడాలని రాయబార కార్యాలయాలను నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం వరదల్లో ఇప్పటివరకు 469 మంది మరణించగా.. సుమారు 1,500 మంది గల్లంతయ్యారు. వీరిలో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!