

తుని మండలం దొండవాక పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ నెల 6న పామాయిల్ తోట ప్రాంతంలో కనిపించకుండా పోయిన చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన కుటుంబ పెంపుడు శునకం తిరిగి ఇంటికి రావడం ఈ కేసులో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ‘మా జానూనైనా మా బిడ్డ దగ్గరకు తీసుకెళ్తుందేమో’ అన్న ఆశతో తల్లి భవాని కన్నీరుమున్నీరవుతున్నారు.
దాదాపు 50 ఎకరాల పామాయిల్ తోటతో పాటు పరిసర కొండ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ టవర్ డేటా, బావులు, చెరువులు, అటవీ ప్రాంతాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు సూచించిన ప్రదేశాల నుంచి వెంట్రుకలు తదితర ఆధారాలను సేకరించి పరిశీలిస్తున్నారు. గాలింపు చర్యలను మరింత బలోపేతం చేసేందుకు పెంపుడు శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను అనుసరించాలని అధికారులు నిర్ణయించారు. చిన్నారి అదృశ్యంపై అపహరణ సహా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!