

దేశంలోని మొబైల్ వినియోగదారులకు త్వరలోనే రీచార్జ్ ధరల షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, రాబోయే 3 నుంచి 4 నెలల్లో టెలికం టారిఫ్‌లు 15 శాతం వరకు పెరగవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో మూడు ప్రధాన ప్రైవేట్ టెలికం కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉండటంతో ధరల పెంపునకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది. అలాగే జూన్ త్రైమాసికంలో 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు వినియోగదారులు మారడం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు పెరగడం, ఎక్కువ పని దినాలు ఉండటంతో ప్రైవేట్ టెలికం సంస్థల ఏఆర్‌పీయూ (ARPU) సుమారు 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ వాటాను మరింత పెంచుకుంటుండగా, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను కోల్పోతూనే ఉంది. ఈ త్రైమాసికంలో జియో సుమారు 70 లక్షల, ఎయిర్‌టెల్ 50 లక్షల కొత్త వినియోగదారులను చేర్చుకోగలదని అంచనా. వొడాఫోన్ ఐడియా మాత్రం సుమారు 2 లక్షల కొత్త కస్టమర్లను మాత్రమే పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల విస్తరణతో డేటా వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 90 శాతానికి పైగా జిల్లాల్లో 5జీ సేవలు అందిస్తుండగా, వొడాఫోన్ ఐడియా కూడా దాదాపు 100 నగరాలకు తన 5జీ సేవలను విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీపై ఉన్న ఏజీఆర్ బకాయిల భారం గణనీయంగా తగ్గడం సంస్థకు ఊరటనిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!