

పృథ్వీ షాతో బ్రేకప్ జరిగిందనే వార్తలను అతని కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఖండించారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనను మోసం చేశారని పేర్కొంటూ ఎవరిపేరూ ప్రస్తావించకుండా చేసిన పోస్టు వైరల్ కావడంతో, అది పృథ్వీ షాను ఉద్దేశించిందేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం రద్దైందని, విడిపోయారని పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారాలకు ఆకృతి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
తాను ఎక్కడా పృథ్వీ షా పేరును ప్రస్తావించలేదని, తమ నిశ్చితార్థం రద్దయిందని లేదా విడిపోయామని కూడా చెప్పలేదని ఆకృతి వెల్లడించారు. తాము ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉన్నామని, తమ బంధం బలంగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠకు నష్టం కలగడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో షేర్ చేసిన స్టోరీ కేవలం తన సన్నిహిత స్నేహితుల కోసం మాత్రమేనని, అది అపార్థానికి దారితీసిందని వివరించారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సంతోషంగా కలిసి ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిన పృథ్వీ షాకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!