

నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా LG Electronics గ్లోబల్ సీఈవో ల్యూ జే చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్‌లతో సియోల్‌లోని ఎల్జీ ట్విన్ టవర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఎల్జీ ఇంజినీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు. అలాగే శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్ రంగాల్లో ఆవిష్కరణలకు ఆర్టీఐహెచ్తో కలిసి ఇన్నోవేషన్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, క్యారియర్ సంస్థ తరహాలో కమర్షియల్ చిల్లర్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ, భారతదేశ రిఫ్రిజిరేటర్ మార్కెట్లో ఎల్జీకి సుమారు 28 శాతం, వాషింగ్ మెషీన్ విభాగంలో 33.5 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపారు. 1997 నుంచి భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్జీ ప్రస్తుతం గ్రేటర్ నోయిడా, రంజన్‌గావ్ (పుణే)లో ప్లాంట్లు నిర్వహిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో మూడో తయారీ యూనిట్ నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 1,500 మందికి ఉపాధి లభించనుండగా, ఈ ఏడాది చివరినాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!