

దిల్లీలో నిరసనల కోసం కేటాయించిన ప్రదేశాలను ఎవరూ నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. నిరసనలకు అధికారికంగా కేటాయించిన ప్రాంతాల్లోనూ నిర్దిష్ట సమయ పరిమితి ఉండాలని వ్యాఖ్యానించింది. దిల్లీలో జరిగిన ఆందోళనలు, వాటి వల్ల ప్రజా జీవనంపై పడుతున్న ప్రభావానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, ఒక వర్గం శాశ్వతంగా ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే రైతులు, జర్నలిస్టులు వంటి ఇతర వర్గాలు తమ సమస్యలపై ఎక్కడ నిరసన తెలుపుతాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. జులై 20న జరిగిన నిరసనకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, ఆందోళనకారులు 17 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని, అనంతరం అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు మార్చ్‌కు పిలుపునిచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.
దిల్లీలో పండగ సీజన్‌లో నిరసనల కారణంగా వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని వ్యాపార సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు నష్టపోతున్నారని, రానున్న రెండు నెలల పాటు రాజధానిలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుతో పాటు వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందే హక్కును కూడా సమతుల్యంగా పరిగణించాలని పేర్కొంది. నిరసనలు నిర్వహించిన సంస్థలను కూడా తమ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని వ్యాపార సంఘాలకు సూచించింది. వ్యాపారాలకు జరిగినట్లు చెబుతున్న నష్టానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, వారి స్పందనను కోరింది. అయితే, నిరసనలపై రెండు నెలల నిషేధాన్ని సుప్రీంకోర్టు విధించలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!