

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ‘డ్రీమ్‌బీన్స్’ పేరుతో సరికొత్త ప్రయోగాత్మక ఏఐ యాప్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల రోజువారీ కార్యకలాపాలు, ఆసక్తులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత విజువల్ స్టోరీలను రూపొందించడం దీని ప్రత్యేకత. యూజర్ అనుమతితో జీమెయిల్, క్యాలెండర్, ఫొటోస్, యూట్యూబ్ సెర్చ్, వర్క్‌స్పేస్ వంటి గూగుల్ సేవల్లోని సమాచారాన్ని ఈ యాప్ విశ్లేషిస్తుంది. రోజంతా జరిగిన కార్యకలాపాలను రాత్రివేళ పరిశీలించి, తెల్లవారుజామున వినియోగదారులకు అనుగుణమైన స్టోరీలను అందిస్తుంది. సందర్భాన్ని బట్టి చిత్రాలు, యానిమేటెడ్ వీడియో క్లిప్‌లను కూడా రూపొందిస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా ప్రాంప్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే యాప్ కంటెంట్‌ను సిద్ధం చేస్తుంది.
డ్రీమ్‌బీన్స్‌లో రూపొందిన స్టోరీలపై యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయడంతోపాటు, వాటికి సంబంధించి ఏఐని ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో మరింత ఆసక్తికరమైన కంటెంట్‌ను అందించేలా యాప్ పనిచేస్తుంది. వ్యక్తిగత సమాచార భద్రత కోసం పలు నియంత్రణలను అందుబాటులో ఉంచినట్లు గూగుల్ తెలిపింది. ఏయే గూగుల్ సేవలకు అనుమతి ఇవ్వాలి, వేటిని తొలగించాలి అనే విషయాలను యూజర్లే నిర్ణయించుకోవచ్చు. తమకు కనిపించకూడదనుకున్న అంశాలను బ్లాక్ చేయడంతోపాటు, ఎప్పుడైనా వ్యక్తిగత డేటాను పూర్తిగా తొలగించుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ యాప్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా పలు భాషలకు మద్దతు ఇస్తుంది. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు దీనిని వినియోగించుకోవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!