

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అచంచల విశ్వాసం ఉందని, దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపార గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదని, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులని అన్నారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే తన సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలని, దేశ ఐక్యత దెబ్బతినకూడదని ఆయన అన్నారు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించానని తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శనం, తనపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశసేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!