

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని శాప్ ఎండీ భరణి తెలిపారు. ఎంపికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియాతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భరణి మాట్లాడారు. జూడో ఎంపికలపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, సంబంధిత క్రీడా సంఘం సమర్పించిన ప్రతి ధ్రువపత్రాన్ని పరిశీలించిన తర్వాతే ఎంపికలు చేపట్టామని తెలిపారు. డీవోపీటీ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రక్రియను అమలు చేశామని, ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు చదువుకునే సమయంలోనే పోటీల్లో పాల్గొనాలనే నిబంధన లేదని, కర్ణాటకలో చదువుతున్న క్రీడాకారులు కూడా ఏపీ నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే జిల్లా స్థాయి పోటీలకు సంబంధిత క్రీడా సంఘాల ధ్రువీకరణ అవసరమని పేర్కొన్నారు.
బాక్సింగ్‌లో ఏపీకి పేరు తెచ్చిన అప్పలరాజుపై, కొనద పద్మజ వయసుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని భరణి అన్నారు. మరోవైపు టెట్‌పై పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా పలు కీలక వివరాలు వెల్లడించారు. ఒకసారి టెట్ అర్హత సాధిస్తే అది జీవితాంతం చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అర్హత మార్కులు వేర్వేరుగా ఉంటాయని, టెట్‌కు 20 శాతం వెయిటేజ్ ఉంటుందని చెప్పారు. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. పీజీటీ ప్రిన్సిపాళ్లకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులపై వచ్చే ప్రతి ఆరోపణను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!