

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం తన నివాసంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద జీవిత బీమా ద్వారా రూ.2 లక్షలు, ప్రమాద బీమా ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతోందని సీఎం తెలిపారు. ప్రమాద బీమా మొత్తాన్ని యథాతథంగా కొనసాగించాలని, జీవిత బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి ఇందిరమ్మ బీమాలో చేర్చాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ బీమా భద్రత పొందుతున్న వారిలో ఏ ఒక్కరినీ కొత్త పథకం నుంచి మినహాయించకూడదని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు పథకం వివరాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 19న సిద్దిపేటలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే తయారైన చీరలను అన్ని జిల్లాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు. పంపిణీలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!