

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై సమావేశంలో చర్చించారు. ఈ సదస్సు ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచే అంశాలపై సమీక్షించారు. ఇందులో భాగంగా రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు, తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భీమిలి పరిధిలోని అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో రావళి స్పిన్నర్స్ పరిశ్రమ విస్తరణకు రూ.237 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు అంగీకరించింది. జగ్గయ్యపేటలో 30 ఎకరాల విస్తీర్ణంలో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 24.96 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయించింది. మరోవైపు విజయవాడలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా పరిశీలించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!