

ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రెండు అధునాతన కృత్రిమ మేధస్సు మోడళ్లను విడుదల చేసింది. క్లాడ్ ఫేబుల్ 5.2, క్లాడ్ మైథోస్ 5.2 పేర్లతో వీటిని నవంబర్ 9న అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని సంస్థ సీఈఓ డారియో అమోడెయ్ పిలుపునిచ్చిన తర్వాత ఆంత్రోపిక్ విడుదల చేసిన తొలి కీలక మోడళ్లు ఇవే. మరోవైపు, సంస్థ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కొత్త మోడళ్ల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. మునుపటి వెర్షన్లతో పోలిస్తే ఇవి 30 శాతం వేగంగా ఫలితాలను అందించడంతో పాటు, సుమారు 20 శాతం తక్కువ ఖర్చుతో పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది. ప్రతి మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 8 డాలర్లు, ప్రతి మిలియన్ అవుట్‌పుట్ టోకెన్లకు 40 డాలర్లుగా ధర నిర్ణయించింది. కోడింగ్, తార్కిక విశ్లేషణ, విజువల్ సామర్థ్యాల్లో మెరుగుదలలు ఉన్నాయని తెలిపింది. అంతర్గత పరీక్షల్లో క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ పనులు, ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పన, రోబోటిక్స్ పరిశోధనతో పాటు బ్లాక్‌హోల్స్‌కు సంబంధించిన భౌతికశాస్త్ర సమస్యల పరిష్కారంలో ఈ మోడళ్లు సహకరించినట్లు పేర్కొంది.
రెండు మోడళ్లు ఒకే ప్రాథమిక ఏఐ సాంకేతికతపై పనిచేస్తున్నప్పటికీ, వాటి భద్రతా పరిమితులు, వినియోగ విధానాల్లో తేడాలున్నాయి. క్లాడ్ ఫేబుల్ 5.2లో సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్ పరిశోధనలకు సంబంధించిన ప్రమాదకర వినియోగాలను నియంత్రించే అదనపు భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. ఇది క్లాడ్, క్లాడ్ కోడ్, ఏపీఐతో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ద్వారా అందుబాటులో ఉంది. మరోవైపు, క్లాడ్ మైథోస్ 5.2లో పరిమితులు తక్కువగా ఉండటంతో సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ పరిశోధనల్లో పనిచేసే ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే అందించనున్నారు. వెయ్యికి పైగా ఏఐ ఏజెంట్ల సాయంతో ఎనిమిది రోజుల్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించినట్లు ఆంత్రోపిక్ వివరించింది. అయితే, మైథోస్ 5.2ను ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. సంక్లిష్టమైన సాంకేతిక ప్రాజెక్టులను నిర్వహించడంతో పాటు, పలు ఏఐ ఏజెంట్ల సమన్వయంతో పనిచేసేలా ఈ మోడళ్లను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!