

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా మార్గాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సభా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు. అలాగే మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభలో ముఖ్యమంత్రి వివరించనున్నారని మంత్రులు తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితి పెంపు, ఉద్యోగ నియామకాలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలపై వివరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం వంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు మంత్రి వివేక్ వెంకట్ స్వామి వెల్లడించారు. సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!