

ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ తన సొంత కృత్రిమ మేధస్సు మోడళ్లను ఉపయోగించి మరింత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు స్వతంత్ర ఏఐ భద్రతా పరిశోధనా సంస్థ METR వెల్లడించింది. ఈ సంస్థ 11 వారాల పాటు ఆంత్రోపిక్ అంతర్గత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై అధ్యయనం చేసి నవంబర్ 5న నివేదికను విడుదల చేసింది. గతంలో ఉన్న వేగంతో పోలిస్తే 2025 అక్టోబర్ నుంచి ఆంత్రోపిక్ ఏఐ సామర్థ్యాల అభివృద్ధి దాదాపు 1.9 రెట్లు వేగవంతమైనట్లు నివేదిక అంచనా వేసింది. అదనపు కంప్యూటింగ్ సామర్థ్యం కంటే ఏఐ మోడళ్ల వినియోగమే ఈ పురోగతికి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. సంస్థలో అత్యంత సామర్థ్యమున్న అంతర్గత ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్న ఉద్యోగులు.. ఏఐ సహాయం లేకుండా పనిచేసినప్పటితో పోలిస్తే తమ ఉత్పాదకత దాదాపు 12 రెట్లు పెరిగినట్లు వెల్లడించారని నివేదిక తెలిపింది. గత ఆరు నెలల్లో అభివృద్ధి చేసిన, ఇంకా విడుదల చేయని పలు అంతర్గత ఏఐ మోడళ్లు ఈ పురోగతిలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది.
ఈ పరిణామాలు ఏఐ భవిష్యత్తుపై కొత్త ఆందోళనలకు దారితీస్తున్నాయి. మానవుల ప్రమేయం లేకుండానే ఏఐ వ్యవస్థలు తమకంటే మెరుగైన తదుపరి మోడళ్లను రూపొందించుకునే ప్రక్రియను ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’గా పిలుస్తారు. భవిష్యత్తులో ఏఐ పరిశోధనలో ఇటువంటి స్వయంప్రతిపత్తి మరింత పెరిగే అవకాశం ఉందని METR హెచ్చరించింది. మరోవైపు, నివేదికలోని కీలక వివరాల్లో అధిక భాగాన్ని ఆంత్రోపిక్ ప్రచురణకు ముందు తొలగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల నివేదికలోని కొన్ని నిర్ధారణలను ప్రజలు స్వతంత్రంగా పరిశీలించడం కష్టమవుతుందని METR పేర్కొంది. దీనిపై ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు సామ్ మెక్‌కాండ్లిష్ స్పందిస్తూ.. ఏఐ అభివృద్ధి వేగం పెరగడానికి కారణమైన వివరాలను వెల్లడిస్తే సంస్థకు సంబంధించిన వ్యాపార రహస్యాలు బయటపడటంతో పాటు, ఇతర సంస్థలకు ఏఐ అభివృద్ధిని వేగవంతం చేసే మార్గం తెలిసే ప్రమాదం ఉందని సమర్థించారు. ఏఐ భద్రతపై బహిరంగంగా ప్రాధాన్యత ఇస్తున్న ఆంత్రోపిక్.. మరోవైపు సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ కూడా మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!