

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. నిలక్కల్ నుంచి పంబ వరకు ప్రయాణించే భక్తులు రోడ్లపై ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు పడేయవద్దని సూచించింది. రోడ్లపై పడేసిన ఆహార పదార్థాలు, చెత్త కారణంగా వన్యప్రాణులు రహదారులపైకి వస్తున్నాయని, దీంతో వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 16 నుంచి 23 మధ్య ఈ మార్గంలో వాహనాలు ఢీకొనడంతో రెండు కోతులు, ఒక నీలగిరి లంగూర్ మరణించినట్లు వెల్లడించారు. నీలగిరి లంగూర్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్-1 జాతికి చెందినదని అటవీ శాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ మను సత్యన్ తెలిపారు.
నిలక్కల్ నుంచి పంబ వరకు ఉన్న 19 కిలోమీటర్ల రహదారి అటవీ ప్రాంతం గుండా వెళ్తుందని మను సత్యన్ వివరించారు. రహదారి వెడల్పు పెంచి తారు వేయడంతో వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, దీనివల్ల వన్యప్రాణులకు ప్రమాదం పెరుగుతోందని పేర్కొన్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని, భక్తుల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాలని అధికారులు సూచించారు. యాత్రికులు చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లోనే వేయాలని, అటవీ జంతువుల సంరక్షణకు సహకరించాలని కోరారు.
మరోవైపు, శబరిమల యాత్ర మార్గంలోని లోయర్ అప్పాచిమేడు సమీపంలో భక్తుల కోసం కొత్త విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. సుమారు 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రంలో ఒకేసారి వెయ్యి మంది భక్తులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఇందులో టైల్స్ ఫ్లోరింగ్, స్టీల్ బెంచీలు, సీటింగ్ సదుపాయాలతో పాటు తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. గతంలో నిరుపయోగంగా ఉన్న ఈ ప్రదేశాన్ని రూ.11 లక్షలతో ఆధునీకరించినట్లు బోర్డు తెలిపింది. నవంబర్ నెలాఖరులోగా ఈ విశ్రాంతి కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!