

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. మూడు పేజీల ఈ లేఖలో ఇటీవల కొలీజియం చేసిన సిఫార్సులపై ఆయన పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిభ, వైవిధ్యం, సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఒక వర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం ఉందని లేఖలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రతిభతో పాటు అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన కొన్ని నిర్ణయాలపైనా గవాయ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో శిక్షాత్మక కారణాలతో బదిలీ చేసిన కొందరు న్యాయమూర్తులకు ఇప్పుడు ప్రముఖ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ప్రతిభావంతుడైన, కష్టపడి పనిచేసే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరో న్యాయమూర్తికి అవకాశం కల్పించేందుకు చిన్న హైకోర్టుకు బదిలీ చేశారని లేఖలో పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకత, నిష్పాక్షికత, వైవిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాజీ సీజేఐ కోరినట్లు తెలుస్తోంది. ఇవి ఆయన లేఖలో చేసిన ఆరోపణలు మాత్రమే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!