

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ కాలంలో ఆర్థిక భృతిని విడుదల చేసింది. మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు ఇది స్పష్టమైన ఉదాహరణ. “మత్స్యకారుల సేవలో” పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.20 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత ప్రభుత్వం రూ.10 వేలే అందించగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. మొత్తం రూ.262 కోట్లు ఈ పథకానికి కేటాయించగా, కాకినాడ జిల్లాలో 24,930 మందికి రూ.49.86 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మందికి రూ.13.79 కోట్లు విడుదలయ్యాయి.
మత్స్యకారుల వలసలను తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. కాకినాడ జిల్లా తీరప్రాంతంలోని 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 గ్రామాలకు పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. 4,578 బోట్లకు డీజిల్ సబ్సిడీగా రూ.8.23 కోట్లు, పీఎం మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో పరికరాల కొనుగోలుకు రూ.1.13 కోట్లు అందించారు. కోనపాపపేటలో రూ.2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతోంది. మత్స్యకారుల భద్రత కోసం ట్రాన్స్పాండర్లు, సముద్ర జీవవైవిధ్యం పెంపు కోసం ఆర్టిఫిషియల్ రీప్స్, తాబేళ్ల రక్షణ కోసం టెడ్ పరికరాలను ఉచితంగా అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తూ, తీరప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!