

నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌లో అవకతవకలపై విచారణ జరపడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. వ్యక్తిగత సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ సంబంధించిన సాధారణ అంశాలను ఒకే పిటిషన్‌లో కలిపి దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ఇలాంటి మిశ్రమ అంశాలతో ఉన్న పిటిషన్‌ను ఈ రూపంలో విచారించలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ లేదా ఇతర అక్రమాలు జరగలేదని, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానం సురక్షితమైనదని కోర్టుకు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!