

ఓఆర్‌ఆర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు కోసం ఈ నెల 27 నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వి.పి. గౌతం తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ నిర్వహించనున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉందా, ఓఆర్‌ఆర్ పరిధిలో దరఖాస్తుదారులకు ప్లాట్ (Flat), ఫ్లాట్ (Plot) వంటి ఆస్తులు ఉన్నాయా తదితర వివరాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తున్నారు. దరఖాస్తుదారుల వివరాలను గురువారం సాయంత్రం నుంచి https://ts.meeseva.telangana.gov.in/, tghb.cgg.gov.in, tghb.telangana.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. వివరాలపై అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు తెలియజేయవచ్చు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.
లాటరీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు. యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా లాటరీని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు తదితర రిజర్వేషన్ల ప్రకారం డ్రా నిర్వహిస్తారు. ప్రతి కేటగిరీలో 20 శాతం వెయిటింగ్ లిస్ట్‌ను కూడా లాటరీ ద్వారానే ఎంపిక చేస్తారు. ఇళ్ల కేటాయింపుపై సందేహాలు ఉంటే 040 24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!