

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పరస్పరం పోటీ పడుతున్న దిగ్గజ సంస్థల అధినేతలు కీలక అంశంపై ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక ఏఐ నమూనాల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంతకాలం తగ్గించి, భద్రతా చర్యలు, నియంత్రణలు, ప్రమాదాల అంచనాకు మరింత సమయం కేటాయించాలని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఎక్స్‌ఏఐ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కాకుండా.. సామర్థ్యాల పెరుగుదల వేగాన్ని కొంత తగ్గించడం ద్వారా భద్రతా వ్యవస్థలు సాంకేతిక పురోగతికి అనుగుణంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అమోడై పేర్కొన్నారు. ఇదే వేగంతో ఏఐ అభివృద్ధి కొనసాగితే వచ్చే 6–12 నెలల్లో తప్పుదోవ పట్టిన ఏఐ ఏజెంట్ల సమూహం ఇంటర్నెట్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఏఐ సంస్థల్లో స్వతంత్ర భద్రతా పర్యవేక్షణకు అవకాశం కల్పించడం, ప్రముఖ ఏఐ కంపెనీలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించడం, అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ప్రమాదాలను ఎదుర్కొనే సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి మూడు ప్రధాన ప్రతిపాదనలను అమోడై సూచించారు. ఏఐ భద్రతా పరీక్షలను మరింత స్వతంత్రంగా నిర్వహించేందుకు మూడోపక్ష నిపుణులకు తమ వ్యవస్థలకు ప్రవేశం కల్పిస్తామని ఆంథ్రోపిక్ ప్రకటించింది. దీనికి సామ్ ఆల్ట్మాన్ మద్దతు తెలుపుతూ ఓపెన్‌ఏఐ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు. ఎలాన్ మస్క్ సైతం అమోడై అభిప్రాయాలకు మద్దతుగా స్పందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!