

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య, ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన నాయకుల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వెలువడడం కలకలం రేపింది. మాస్కో అధికారిక వర్గాల ప్రకారం, ఈ ఘటన కొన్ని నెలల క్రితం నోవ్గోరోడ్ ప్రాంతంలోని ఆయన ప్రైవేట్ నివాసం సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించగా, భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటపెట్టలేదని సమాచారం. అనంతరం రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ) ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, బహిరంగ కార్యక్రమాలను గణనీయంగా తగ్గించింది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్ భూగర్భ బంకర్లలోనే ఎక్కువ సమయం గడుపుతూ యుద్ధ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయన చుట్టుపక్కల మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలపై నిషేధం విధించినట్లు సమాచారం. ఉక్రెయిన్ డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఎఫ్ఎస్ఓ సిబ్బంది భద్రతా తనిఖీలను పెంచి, మాస్కో నది పరిసరాల్లో బలగాలను మోహరించారు. దేశంలోని ఉన్నతాధికారుల రక్షణను కూడా పెంచినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, ఉక్రెయిన్ నిఘా సంస్థలు పుతిన్‌పై నేరుగా హత్యాయత్నం జరిగిందనే వార్తలను ఖండించాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలపై పలు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!