

తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడతలో రూ.2,482.02 కోట్లను విడుదల చేసి 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9,000 కోట్లను రైతులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగంపై రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, బీమా, వ్యవసాయ పరికరాల కోసం భారీ నిధులు కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను క్రమంగా గాడిలో పెడుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడి పద్ధతులు పాటించాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!