

చైనాలోని అనేక నగరాల్లో ఎత్తైన భవనాలపై రూఫ్‌టాప్ మిస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థలు గాల్లోకి సూక్ష్మ నీటి తుంపర్లను విడుదల చేసి చల్లని మేఘాల్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీంతో సమీపంలోని వీధులు కూడా చల్లబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడి పరిస్థితుల మధ్య ఈ విధానం ఇతర నగరాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాలో పార్కులు, కూడళ్లు, పాదచారుల మార్గాలు, బస్టాప్‌ల్లో కూడా ఈ వ్యవస్థ విస్తృతంగా వినియోగంలో ఉంది.
ఈ విధానాన్ని ఎవాపరేటివ్ కూలింగ్ అని పిలుస్తారు. ఇందులో హై ప్రెజర్ నాజిల్స్ ద్వారా విడుదలైన సూక్ష్మ తుంపర్లు ఆవిరై సమీప గాలిలోని వేడిని గ్రహిస్తాయి. ఇది మన శరీరం చెమట ద్వారా చల్లబడే విధానంతో సమానంగా పనిచేస్తుంది. బయట ఉష్ణోగ్రత 38°C ఉన్నప్పుడు 5–8°C వరకు తగ్గించగలదు. తుంపర్లు చిన్నగా ఉండటంతో త్వరగా ఆవిరైపోతాయి, రోడ్లు లేదా పాదచారులు తడవరు. సంప్రదాయ ఏసీలతో పోలిస్తే తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఈ వ్యవస్థకు నీరు, పంపులు, నాజిల్స్ మాత్రమే అవసరం. అయితే నీటి వినియోగంపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, మరికొందరు ఇది తక్కువ నీటినే వినియోగిస్తుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల చైనాలో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!