

బొగ్గు రకం గుర్తింపులో జరిగిన చిన్న పొరపాటు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు భారీ ఆర్థిక భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లోని సులియారీ బొగ్గు గనుల్లో ఉన్న బొగ్గును తొలుత జీ6 రకంగా గుర్తించి టెండర్లు కేటాయించారు. ఈ గనుల తవ్వకాల, నిర్వహణ బాధ్యతలను అదానీ విద్యుత్ సంస్థకు అప్పగించారు. అయితే అనంతరం బొగ్గు నియంత్రణ సంస్థ ఆ బొగ్గును జీ7 రకంగా నిర్ధారించడంతో వివాదం మొదలైంది.
సులియారీ గనుల్లో జీ6 రకం బొగ్గు ఉందని భావించి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు జీ7గా మారడంతో తమపై రూ.300 కోట్ల అదనపు భారం పడుతోందని అదానీ సంస్థ వాదిస్తోంది. ఈ నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థే భరించాలని సంస్థ స్పష్టం చేసింది. దీనిపై గనుల సంస్థ పలుమార్లు బొగ్గు నియంత్రణ సంస్థను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా పలుమార్లు లేఖలు రాసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
ఈ వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు గనుల శాఖ అధికారులు అదానీ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ చర్చలు ఫలించకపోతే న్యాయపరమైన వివాదానికి దారితీసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు రకం విషయంలో స్పష్టత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించాలని గనుల శాఖ కోరుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!