

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంస్థలో కొత్తగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో సర్వీసు నుంచి తొలగించిన సుమారు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక కమిటీ పరిశీలన అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు బ్రెడ్ విన్నర్స్ స్కీమ్ కింద 1,424 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల బకాయి ప్రయోజనాలను త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ, రవాణాశాఖల విజయాలను మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, రాష్ట్రంలో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో త్వరలో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, బైక్ ట్యాక్సీలకు ఎల్లో నంబర్ ప్లేట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీన ప్రక్రియలో ఏపీలో ఎదురైన ఇబ్బందులు తెలంగాణలో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!