

దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్ అధికారులతో ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్ సంయుక్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు ఐపీఎస్ అధికారులకు చోటు దక్కింది. ఒడిశాలోని ఝార్సుగూడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర టాప్ 25లో స్థానం సంపాదించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, సామాజిక కార్యక్రమాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 2019 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర నక్సల్స్ ప్రభావిత నౌపడ ఎస్పీగా పనిచేసిన సమయంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుని నక్సల్స్ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ సేవలకు కేంద్ర హోం శాఖ నుంచి మెడల్ కూడా అందుకున్నారు.
ప్రస్తుతం ఝార్సుగూడ ఎస్పీగా పనిచేస్తున్న రాఘవేంద్ర పోలీసింగ్‌లో పలు సంస్కరణలు చేపడుతున్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల బాధ్యతను పెంచేందుకు ఆటోలు, ట్యాక్సీలను క్యూఆర్ కోడ్‌తో గుర్తించే స్మార్ట్ ఆటో ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. టాప్ 25 పోలీస్ అధికారుల జాబితాలో తనకు దక్కిన గుర్తింపును తోటి అధికారులు, సిబ్బందికి రాఘవేంద్ర అంకితం చేశారు. ఇదే సమయంలో సూపర్ 5 విభాగంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ, సైబర్ క్రైం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు చోటు దక్కింది. దీంతో పోలీస్ శాఖలో ప్రతిభ కనబరుస్తున్న తెలుగు అధికారులకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!