

దేశీయంగా ఈ నెలలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 35 శాతం వృద్ధితో 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా అమ్మకాల్లో నమోదైన వృద్ధి ఈ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. గత ఏడాది జీఎస్‌టీ రేటు తగ్గింపు, ఆదాయ పన్ను ప్రయోజనాలు, రెపో రేటు తగ్గింపు వంటి చర్యలతో ఆటోమొబైల్ పరిశ్రమకు లభించిన ఊపు కొనసాగుతోందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. పండగ సీజన్‌లోకి పరిశ్రమ ఆశావాదంతో అడుగుపెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో మహీంద్రా 42 శాతం, టాటా మోటార్స్ పీవీ 56 శాతం, మారుతి సుజుకీ 21.3 శాతం, హ్యుండయ్ మోటార్ 8.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. టూ వీలర్స్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్ 8 శాతం, బజాజ్ ఆటో 28 శాతం, టీవీఎస్ మోటార్ 21 శాతం, సుజుకీ మోటార్‌సైకిల్ 6 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 11 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!