

ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే సూర్యభగవానుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అరుదైన సూర్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాకు చెందిన గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. కాకినాడకు సమీపంలో, తుల్యభాగ నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం అరసవల్లి తర్వాత ప్రాముఖ్యత కలిగిన సూర్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర ప్రకారం, కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని 1902 నుంచి 1920 మధ్య గొల్లల మామిడాడ జమీందారు కొవ్వూరి బసివి రెడ్డి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
ఈ ఆలయంలో తూర్పు, పశ్చిమ దిశల్లో ఎదురెదురుగా రెండు భారీ గాలి గోపురాలు ఉన్నాయి. తొమ్మిది అంతస్తులతో సుమారు 160 అడుగుల ఎత్తులో ఉన్న గోపురం, 13 అంతస్తులతో సుమారు 200 అడుగుల ఎత్తులో ఉన్న మరో గోపురం సందర్శకులను ఆకట్టుకుంటాయి. గోపురాలపై రామాయణ, మహాభారత ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గర్భాలయంలో సూర్యభగవానుడు ఉష, పద్మిని, ఛాయాదేవి సమేతంగా ఏడు గుర్రాల రథంపై దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో గణపతి, గరుడాళ్వార్, హనుమంతుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు నిర్వహిస్తారు. ఆదివారాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. రథసప్తమి, భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!