

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని నగరం గ్రామ పరిధిలో, తాడివారిమెరక సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఘటన తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రతకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు.
ఓఎన్జీసీ సాంకేతిక బృందం ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఇటీవల వరుసగా గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!