

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టుల నుంచి తప్పుకోవడం కోహ్లీ తన కెరీర్‌లో తీసుకున్న అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఫిట్‌నెస్ కలిగిన కోహ్లీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో మరికొంతకాలం రాణించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో కోహ్లీ పశ్చాత్తాపపడే అవకాశం ఉందని అన్నారు. 2025 మేలో కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత ఈ నిర్ణయంపై అతడు పునరాలోచించే అవకాశం ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
‘‘టెస్టుల నుంచి రిటైర్ కావడం కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు అని భావిస్తున్నా. అతడి ఫిట్‌నెస్ అద్భుతం. 25 ఏళ్ల వయసున్న క్రికెటర్‌తోనైనా పోటీపడగల సామర్థ్యం కోహ్లీకి ఉంది. కోపంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. మొహిందర్ అమర్‌నాథ్‌ను ఎన్నోసార్లు జట్టు నుంచి తప్పించినా.. ఆయన తిరిగి చోటు సంపాదించుకుని తన సత్తా నిరూపించుకున్నారు’’ అని కపిల్ దేవ్ గుర్తుచేశారు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 638 పరుగులు చేసినట్లు అందించిన వివరాలు చెబుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!