

ఆంధ్రప్రదేశ్‌లో ‘అక్వాన్’ తుపాను కదలికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రస్తుత గమనంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఈ సాయంత్రానికి తుపాను తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు వివరించారు. విపత్తుల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటి ప్రభావం ప్రజలపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని, ప్రభుత్వం, అధికారులు అండగా ఉన్నారనే భరోసా కల్పించాలని సూచించారు.
ఇటీవల కాలంలో రాష్ట్రం మూడో తుపానును ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని ఆదేశించారు. తుపాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!