

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించిన భూసర్వే పూర్తికాగా.. దానికి సంబంధించిన సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ హైమావతికి చేరింది. ఈ నివేదికను కలెక్టర్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో సుమారు 388 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు. తొలుత భూమి బాహ్య హద్దులను గుర్తించిన అధికారులు.. రికార్డుల్లో ఉన్న అనుభవదారులకు నోటీసులు జారీ చేసి, అనంతరం రైతుల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.
ఎర్రవల్లిలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. తమ గ్రామానికి చెందిన భూములు కూడా ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో కలిపారని శివారు వెంకటాపూర్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్కులు, గ్రామ నక్షాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రత్యేకంగా సర్వే చేయాలని వారు అధికారులను, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వే నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారనే దానిపై రైతుల్లోనూ, స్థానికుల్లోనూ ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!