

ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి వానాకాలంలో తక్కువ వ్యవధి, తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలను సాగు చేయాలని కోరారు. మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టినందున వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందించేందుకు వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భజల, వాతావరణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!