

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. SIRకు ముందు ఓటర్ల జాబితాలో పేరు ఉండి, సవరణ అనంతరం జాబితాలో కనిపించని అర్హులైన వ్యక్తులను ఈ కార్యక్రమంలో గుర్తించనున్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు, ఇటీవల ఓటు హక్కుకు అర్హత పొందిన యువత తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) కీలక పాత్ర పోషించనున్నారు.
BLOలు SIRకు ముందు ఉన్న ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి, గతంలో పేరు ఉండి ప్రస్తుతం కనిపించని అర్హులైన వ్యక్తులను గుర్తిస్తారు. అవసరమైన చోట్ల ఇంటింటికీ వెళ్లి వివరాలను ధ్రువీకరించి, అర్హత ఉన్నవారితో ఫారం-6 దరఖాస్తును పూర్తి చేయించేందుకు సహకరిస్తారు. ఒక్కో BLO వారానికి 20 నుంచి 25 మంది ఓటర్లను పరిశీలించేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సమాచారం. మొత్తం ప్రత్యేక కార్యక్రమాన్ని సుమారు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటర్ల నమోదును సులభతరం చేసేందుకు బూత్ స్థాయి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే SIR పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ అమలు చేయనున్నారు. ఇదే సమయంలో SIRపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!