

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, మంత్రి నారా లోకేశ్ చొరవతో రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, వ్యాపార నిర్వహణలో సరళత కారణంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. తమిళనాడుకు చెందిన పెట్టుబడుల సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలను ఖండిస్తూ, ఇతర రాష్ట్రాల విధానాలను అనుకరించాల్సిన అవసరం ఏపీకి లేదని స్పష్టం చేశారు.
ఘర్షణాత్మక వైఖరికి బదులుగా ఆరోగ్యకరమైన పోటీని నమ్ముతున్నామని, రాష్ట్రానికి సొంత పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కార్యాచరణ ఉన్నాయని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గతంలో చంద్రబాబు దార్శనికతతో హైదరాబాద్‌లో సైబరాబాద్ రూపుదిద్దుకుని అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా ఎదిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీ వంటి అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులకు ఏపీ వేదికగా నిలుస్తోందన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు ఎస్క్రో ఖాతాల విధానంతో పాటు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!