

20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్‌లో అధిక తేమ లేదా క్లోరైడ్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన అదనపు పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వెల్లడించాయి. ఇంధన నాణ్యత నిర్దేశిత ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నాయి. సియామ్ ఇంతకుముందు పెట్రోలియం శాఖకు లేఖ రాసి, అనంతరం దానిని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అదనపు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపాయి. ఇథనాల్‌లో క్లోరైడ్ స్థాయికి ప్రభుత్వం కఠిన ప్రమాణాలు విధించిందని, రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినళ్లు, రిటైల్ అవుట్‌లెట్లలో నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థలు వివరించాయి.
దేశవ్యాప్తంగా సుమారు 90 వేల పెట్రోల్ బంకుల భూగర్భ ట్యాంకుల్లో మొబైల్ పరీక్షా ల్యాబ్‌లు, స్వతంత్ర ప్రయోగశాలల ద్వారా రోజుకు 8 నుంచి 12 సార్లు తేమశాతం పరీక్షిస్తున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఎక్కడా గణనీయమైన తేడా కనిపించలేదని పేర్కొన్నాయి. రిఫైనరీల నుంచి సేకరించిన 100కుపైగా పెట్రోల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 1 పీపీఎం లేదా అంతకంటే తక్కువగా ఉండగా, 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో అది 3 పీపీఎం కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయి. రిటైల్ బంకుల నుంచి సేకరించిన 160కుపైగా ఈ20 నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 0 నుంచి 3 పీపీఎం మధ్య ఉన్నట్లు తెలిపాయి. రెండు ప్రాంతాల్లో క్లోరైడ్ స్థాయి అధికంగా గుర్తించడంతో అక్కడ సరఫరాను నిలిపివేసి, దిద్దుబాటు చర్యల అనంతరం మాత్రమే పునరుద్ధరిస్తామని పేర్కొన్నాయి. పరీక్షా ఫలితాలను సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపాయి. దేశవ్యాప్తంగా 1.07 లక్షల బంకుల్లో పరీక్షలు నిర్వహించగా కేవలం నాలుగు చోట్ల మాత్రమే సమస్యలు గుర్తించామని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. అప్పుడప్పుడు ఒక ఉత్పత్తిలో కలుషితానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని, దానిని మొత్తం వ్యవస్థలో లోపంగా పరిగణించకూడదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!