

టర్కీలోని ఆంటాల్యాలో జరిగిన విలువిద్య ప్రపంచ కప్ మూడో దశ పోటీల్లో తెలుగు విలువిద్యాకారుడు బొమ్మదేవర ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. మిశ్ర జట్టు విభాగంతో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు గెలిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.
ధీరజ్ సాధించిన ఈ ఘన విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆయన, ధీరజ్ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచ విలువిద్యలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీ వూ సియోక్‌ను ఫైనల్లో ఓడించి స్వర్ణ పతకం సాధించడం ధీరజ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు.
మిశ్ర జట్టు విభాగంలో ధీరజ్‌తో కలిసి స్వర్ణ పతకం సాధించిన కుమ్కుమ్ మొహోద్‌కు, అలాగే భారత జట్టుకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై మరింత పెంచాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!