

విజయవాడలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వాన రాత్రి 10 గంటల తర్వాత మరింత తీవ్రంగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో సాధారణ జీవనం అంతరాయం కలిగింది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గోదావరి నదికి వరద హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఈ రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక, రేపు రెండవ హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్, మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, వాగులు, వంకలు దాటవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!