

బెంగళూరులో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి మాటలను నమ్మి ఆమెను కలిసేందుకు వెళ్లిన 33 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి నిలువు దోపిడీకి గురయ్యాడు. చందాపురకు చెందిన బాధితుడు గత కొన్ని నెలలుగా డేటింగ్ యాప్‌ను వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో పూనం పేరుతో పరిచయమైన యువతి కలుద్దామని పిలవడంతో అతను ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లాడు. అనంతరం హులిమంగలలోని ఓ పబ్‌కు వెళ్దామని చెప్పి, తన కారులో రావాలని యువతి సూచించింది. మార్గమధ్యలో కారులో ఇంధనం నింపుకున్న తర్వాత కొంతదూరం వెళ్లగానే ఆమె నిర్మానుష్య ప్రాంతంలో కారును నిలిపింది. వెంటనే నలుగురు అపరిచితులు అక్కడికి వచ్చి కారులోకి ఎక్కారు.
బాధితుడిని బెదిరించిన నిందితులు అతని ఫోన్ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏటీఎం కార్డును తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని నగదు డ్రా చేసుకున్నారు. క్రెడిట్ కార్డు పిన్ నంబర్‌ను మార్చి మరో ఖాతాకు రూ.3.2 లక్షలు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. చివరగా బాధితుడిని మెట్రో స్టేషన్ సమీపంలో కారులో నుంచి దించి నిందితులంతా పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెబ్బగోడి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!