

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 194 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 389 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 50.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. సౌద్ షకీల్ 97 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ నాలుగు, జోష్ టంగ్ మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ పరాజయంతో పాకిస్థాన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో 16.67 శాతం విజయాలతో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ 34.44 శాతం విజయాలతో ఆరో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ 51.52 శాతం విజయాలతో ఐదో స్థానంలో ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!