

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చబహార్ సమీప ప్రాంతాల్లో అమెరికా సైనిక చర్యలు జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు చెందిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చబహార్ పోర్టులోని ఒక టెర్మినల్‌ను నిర్వహిస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగితే ఈ ప్రాజెక్టు అమలు, వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చబహార్ పోర్టు భారత్‌కు ఆఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో పాకిస్థాన్‌ను దాటకుండా నేరుగా వాణిజ్య సంబంధాలు కొనసాగించేందుకు కీలక మార్గంగా ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)లో ఇది ప్రధాన కేంద్రంగా భావించబడుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా యూరప్‌తో వాణిజ్యాన్ని వేగవంతం చేయడంతో పాటు చైనా–పాకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా భారత్ తన ఉనికిని బలోపేతం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ నిశితంగా పర్యవేక్షణ కొనసాగిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!