

తమిళనాడులోని తేని నుంచి కేరళలోని శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ధృవీకరించారు. ప్రతిపాదిత మార్గానికి సంబంధించిన సాంకేతిక, కార్యాచరణ సాధ్యతలను అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సిద్ధం చేయనున్నారు.
సర్వే పూర్తైన తర్వాత తమిళనాడు, కేరళ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపడంతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం తేని పరిసర ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు కుంబం, కుమిలి, ఎరుమేలి, పంబా మీదుగా ప్రధానంగా రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే భక్తుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. మరోవైపు, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంగమలి–శబరి రైల్వే లైన్‌కు సంబంధించి కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.505 కోట్లు కేటాయించింది. తేని–ఎరుమేలి, అంగమలి–శబరి రెండు మార్గాలు పూర్తయితే శబరిమలకు రెండు వేర్వేరు దిశల నుంచి మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!